పేదలకు సొంతింటి కలను సాకారం చేయాల్సిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు పక్కదారి పడుతున్నాయని మండలం గంగారంతండా సర్పంచ్ కిరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ సంతకం లేకుండానే ఇళ్ల మంజూరుకు సంబంధించిన తీర్మానాలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రజల చేత ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా, ఆయన ప్రమేయం లేకుండానే ఇళ్ల ప్రతిపాదనలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. గంగారంతండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం చోటుచేసుకుంటోందని, అర్హులైన పేదలకు అన్యాయం జరుగుతోందని సర్పంచ్ ఆరోపించారు. గ్రామసభ తీర్మానాలు పారదర్శకంగా జరగాల్సి ఉండగా, సర్పంచ్ సంతకం లేకుండానే ఏడు ఇళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు అధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి వివరించడంతో పాటు జిల్లా కలెక్టర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. తన ఫిర్యాదు మేరకు ప్రత్యేక విచారణ అధికారి అశోక్ పరిశీలన జరిపారని, ప్రతిపాదించిన ఏడు ఇళ్లలో నాలుగు ఇళ్లకు ఇప్పటికే డాబాలు ఉన్నట్లు గుర్తించి వాటిని తిరస్కరించినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన నిరుపేదలకు అందాల్సి ఉండగా, రాజకీయ పలుకుబడితో అనర్హులకు లబ్ధి చేకూర్చే ప్రయత్నాలు జరగడం బాధాకరమని ఆయన అన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పేదలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయపోరాటానికి సైతం వెనుకాడబోనని సర్పంచ్ కిరణ్ స్పష్టం చేశారు.











