కొత్త పింఛన్ల నగదు జమ చేయడంతో పాటు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
తెలంగాణలో కొత్తగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నవంబర్ 26న కొత్త పింఛన్ల నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేయనున్నారు. ఈ నెల నుంచే కొత్త లబ్ధిదారులకు ప్రతినెలా పింఛన్లు అందనున్నాయి.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 4.72 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించి అర్హులను గుర్తించారు. మొత్తం 4.72 లక్షల మంది అర్హత సాధించగా, వారికి ఇప్పటికే మంజూరు పత్రాలు అందించారు. అచ్చంపేట సభలో సీఎం బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. చేయూత పథకం కింద ప్రభుత్వం నెలకు రూ.2,000 పింఛన్ అందిస్తోంది.
ఇదే కార్యక్రమంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని కూడా సీఎం ప్రారంభించనున్నారు. గతంలో నవంబర్ 19న ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. ప్రస్తుతం చీరలను మండల కేంద్రాలకు తరలించారు. మహిళలు ఆధార్ కార్డుతో గ్రామాల్లోని రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో చీరలు పొందేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తోంది.




