Anantapur, 2026-11-26
భారత రాజ్యాంగం కల్పించిన విలువలు, హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడాలని రాజ్యాంగ హక్కుల రక్షణ సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది వి.వై. మూర్తి పిలుపునిచ్చారు.
భారత రాజ్యాంగం కల్పించిన విలువలు, హక్కులను ప్రతి ఒక్కరూ కాపాడాలని రాజ్యాంగ హక్కుల రక్షణ సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, న్యాయవాది వి.వై. మూర్తి పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ హక్కుల రక్షణ సంస్థ () ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న సంస్థ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వి.వై. మూర్తి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం వంటి ప్రాథమిక విలువలను కల్పించిందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, పేదలు, అణగారిన వర్గాలకు రాజ్యాంగ హక్కులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగినప్పుడు బాధితులు చట్టబద్ధంగా పోరాడాలని, కుల, మత, ప్రాంతీయ వివక్షలకు తావులేకుండా సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సంస్థ లక్ష్యాలు
రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడం, న్యాయ అవగాహన కల్పించడం, బాధితులకు న్యాయ సహాయం అందించడం, బలహీన వర్గాల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా రాజ్యాంగ హక్కుల రక్షణ సంస్థ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.







